పంటల మార్పిడిపై దృష్టి సారించాలి
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. వర్షపాతం అనిశ్చితంగా ఉన్న పరిస్థితుల్లో సంప్రదాయ, ప్రాంతానుకూల పంటల సాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. రైతులకు సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు తెలంగాణ రైతాంగం తరఫున రైతు కమిషన్ ధన్యవాదాలు తెలిపింది.
రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. సీఎం ముందుచూపుతో పంటల మార్పిడిపై రైతులకు ఇప్పటికే సూచనలు చేశారన్నారు. రైతు కమిషన్ కూడా పంటల మార్పిడిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం పంటల మార్పిడిని ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ప్రాంతానికి అనుకూలమైన పంటల సాగు చేయాలన్నారు.






