26 August, 2026 | 2:40 AM

ఫాలో ఆన్ ముంగిట లంక

26-08-2026 12:00 AM

* శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఆధిపత్యం చలాయిస్తోంది. భారత బౌలర్లు అదరగొట్టడంతో లంక ఫాలో ఆన్ ముంగిట నిలిచింది. వర్షం కారణంగా మూడో రోజు ఆటను అంపైర్లు ముందుగానే ముగించారు. ప్రస్తుతం లంక జట్టు భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఫాలో ఆన్ దాటాలంటే 39 పరుగులు చేయాల్సి ఉంది.

  1. పోరాడుతున్న దినుష
  2. రాణించిన ప్రసిద్ధ కృష్ణ, సుతార్
  3. శ్రీలంక స్కోరు 265/8
  4.    238 రన్స్ వెనుకబడిన లంక

కొలంబో, ఆగస్టు 25: 8 పరుగులకు 2 వికెట్ల ఓవ్నట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కామిల్ మిషారా(19)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. కామిందు మెండీస్తో కలిసి పసిందు సూర్య బండార ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు.

కామిందు మెండీస్(32)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.వర్షం అంతరాయం కలిగించడంతో రెండో సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. సెకండ్ సెషన్ ఆరంభంలోనే ధనంజయ డిసిల్వా(8)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. దాంతో శ్రీలంక 137 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో సోనాల్ దినుషాతో కలిసి పసిందు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.సెంచరీ దిశగా సాగిన పసిందును జడేజా క్లీన్ బౌల్ చేశాడు.

ఆ వెంటనే నిరోషన్ డిక్వెల్లా(0)ను సిరాజ్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. కేశర నువాంతతో కలిసి సోనాల్ దినుషా పోరాడాడు. తొలి టెస్ట్ ఫామ్ను కొనసాగిస్తూ.. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ ఆచితూచి ఆడింది. 57 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మానవ్ సుతార్ విడదీసాడు. ఈ వికెట్తో 20 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. లాహిరు కుమారా ఆచితూచి ఆడగా.. సొనాల్ దినుషా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్త పడటంతో శ్రీలంక 265/8 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ముగించింది.

లంక ఇన్నింగ్స్ 84వ ఓవర్ జరుగుతుండగా కొలంబోలో వర్షం కురిసింది. మైదానం తడవడంతో ఆటను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, మానవ్ సుతార్ 3 మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా శ్రీలంకను ఆలౌట్ చేసి భారత్ బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేసి 300 ప్లస్ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచి విజయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్ (పడిక్కల్ 117, జురెల్ 115 , పంత్ 63 , గిల్ 50 , జడేజా 43 ; అసితా ఫెర్నాండో 4/106)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 265/8 (సోనాల్ దినుషా  85 బ్యాటింగ్, సూర్యబండార 80;  ప్రసిద్ధ కృష్ణ 3/47 మానవ్ సుతార్ 3/87 )