సీఎస్కేలో వాటా కోరిన ధోనీ?
- 25 శాతం కొనుగోలుకు ఆసక్తి
- 5.5 శాతం ఇస్తామన్న చెన్నై
చెన్నై , ఆగస్టు 25: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఫ్రాంచైజీతో ధోనీకి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొంత కాలంగా అతడి ఐపీఎల్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఒకవేళ ధోనీ రిటైరైనా కూడా సీఎస్కేలోనే ఏదో ఒక రోల్ లో ఉండడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు సమాచారం.
సీఎస్కే షేర్లకు డబ్బులు చెల్లించేందుకు కూడా ధోనీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ధోనీ 25 శాతం షేర్లను అడిగాడని, సీఎస్కే మాత్రం 3 శాతం మాత్రమే ఆఫర్ చేసిందని, దాంతో ధోనీ 20 శాతం షేర్లకు తగ్గాడని ఓ నివేదిక పేర్కొంది. చివరకు ధోనీ 18 శాతం షేర్లు అడగ్గా.. సీఎస్కే 5.5 శాతం కంటే ఎక్కువ ఇచ్చేది లేదని స్పష్టం చేసిందనీ తెలుస్తోంది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని, ధోనీకి, సీఎస్కే మేనేజ్మెంట్ మధ్య ఏళ్ల తరబడి ఉన్న సంబంధం తెగిపోయే అవకాశముందని వార్తఃలు వస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా ధోనీని సంప్రదించకుండానే ఆటగాళ్ల ఎంపిక జరుగుతుందనే వాదన ఉంది. అంతేకాకుండా 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఇటీవలే జట్టును వీడాడు.ఈ డీల్ కుదరకపోవడంతో పాటు, గత కొన్ని సీజన్లుగా ఆటగాళ్ల ఎంపిక వంటి కీలక నిర్ణయాల్లో ధోనీని సంప్రదించకపోవడం వంటి పరిణామాల వల్ల యాజమాన్యంతో ధోనీకి ఉన్న సుదీర్ఘ అనుబంధంలో కొంత సందిగ్ధత నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. యాజమాన్యంగానీ, ధోనీగానీ ఈ వాటాల అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.






