హైటెక్స్‌లో ‘ఫుడ్ ఏ ఫెయిర్’
ప్రారంభించిన బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ప్యాకేజ్డ్ ఫుడ్‌తో పాటు ఆర్గానిక్ ఆహార రంగంలో వస్తోన్న విప్లవాత్మక మార్పులను గురించి చర్చిస్తూ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి నగరంలోని మాదాపూర్‌లో గల హైటెక్స్ వేదికగా నిలిచింది. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ‘ఫుడ్ ఏ ఫెయిర్‘ను గురువారం ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్‌గవార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ‘ఫుడ్ ఏ ఫెయిర్’ ఆకర్షణీయంగా ఉందని, స్వయం సహాయక బృందాలు జొన్న రొట్టె, కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ వంటి ఉత్పత్తులను ప్రదర్శించారని తెలిపారు. గతంలో భూసారం బాగుండేది కాబట్టి మనం తినే ఆహారంలో మంచి పోషకాలుండేవని, ప్రస్తుతం విచ్చలవిడిగా ఎరువులను వాడుతుండడంతో భూసారం దెబ్బతింటోందన్నారు. కాగా, ‘ఫుడ్ ఏ ఫెయిర్’ నేడు, రేపు (శుక్ర, శనివారం) కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.






