23 April, 2026 | 12:36 AM

డ్రోన్లతో ఆహార సరఫరా

24-08-2024 12:00 AM

బీజింగ్, ఆగస్టు 23: ప్రపంచం కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండే డ్రాగన్ కంట్రీ చైనా డ్రోన్ల విషయంలో మరోమారు పై చేయి సాధించింది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆహారం, పానీయాలను సరఫరా చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని మొదలు పెట్టినట్లు చైనా దేశ ఫుడ్ డెలివరీ సంస్థ మెయిటువాన్ ప్రకటించింది. ఈ డ్రోన్లతో అవసరం అయిన సందర్భాల్లో ఔషధాలను కూడా తరలించనున్నట్లు సంస్థ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డ్రోన్లు తయారు చేస్తూ ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. సుదూర ప్రాంతాల్లో జీవనం సాగించే వారి జీవనగతులను మెరుగుపర్చేందుకు ఈ డ్రోన్ డెలివరీలు ఉపయోగపడనున్నాయి. 

5 నిమిషాల్లో సరఫరా

చైనాలోని ది గ్రేట్ వాల్ మీదకు ఏదైనా ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం  ఈ డ్రోన్ల ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సాధ్యం అవుతుందని మెయిటువాన్ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రోన్ డెలివరీల కోసం 4 యెన్‌లను చార్జ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ ఈ డ్రోన్ డెలివరీ ఆర్డర్లు మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు. గ్రేట్ వాల్ వద్ద ఆర్డర్ల డెలివరీ విషయంలో కస్టమర్‌కు ఆహారాన్ని ఎలా చేరవేస్తారనేది కంపెనీ పూసగుచ్చినట్లు వివరించింది.  2016 నుంచే ఈ కామర్స్ సంస్థలు ఈ డ్రోన్ డెలివరీలను మొదలుపెట్టాయి. దాదాపు 15 కిలోల వరకు బరువున్న వస్తువులను డెలివరీ చేస్తున్నాయి.