సారీ బాస్.. టైమ్ అప్
- ఆస్ట్రేలియాలో త్వరలో ‘రైట్ టూ డిస్‌కనెక్ట్’ చట్టం
- ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ
కాన్‌బెర్రా, ఆగస్టు 23: ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల కోసం సోమవారం నుంచి కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగి తన పని గంటలు పూర్తి చేసిన తర్వాత తమ బాసులను ఇక పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. వారు ఎంచక్కా.. తమ వ్యక్తిగత జీవితానికి, తమ కుటుంబసభ్యులకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఈ చట్టాన్ని అక్కడ ఫిబ్రవరిలోనే పాస్ చేయగా సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
ఎన్నో విమర్శల మధ్య
ఈ చట్టం ఆస్ట్రేలియా చట్ట సభల్లోకి రాగానే చాలా కంపెనీలు వ్యతిరేకించాయి. కానీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ చట్టంలో ఉద్యోగి హోదా, యజమానితో మాట్లాడేందుకు తిరస్కరణలో అసహేతుకత, సంస్థలు చెప్పే కారణాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అనే మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపుల వల్ల ఈ చట్టం అమలు చాలా కష్టం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం అక్కడ అమలవుతున్న ఫెయిర్ వర్క్ యాక్ట్‌లోని లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం కొత్తగా ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని నేరంగా మార్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అంతే కాకుండా ఉద్యోగులను నియమించుకునే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ వంటి అనేక ఐరోపా దేశాల్లో ఉద్యోగులు పని గంటల తర్వాత తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకునేలా చట్టాలున్నాయి.






