calender_icon.png 30 July, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార వృథా.. అన్నార్తులకు వ్యధ

18-07-2025 12:00:00 AM

2022లో ఆ ఒక్క ఏడాదిలోనే ప్ర పంచ వ్యాప్తంగా 63 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు చెత్తకుండీ పాలైందని ఓ సర్వే చెప్తోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 73 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధ అనుభవించారు. ఇదే ఏడాది ప్రపం చ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం సుమారు 17 శాతం వృథా అయింది. దీన్నిబట్టి ఆకలి బాధ ప్రపంచాన్ని ఎలా పట్టిపీ డిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక అలమటి స్తుంటే, మరొక వైపు ఆహారం వృథా ప్రపం చ ఆరోగ్య సంస్థలను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజుల్లోనే టన్నుల కొద్దీ ఆహారం చెత్తకుప్పల్లోకి చేరుతున్నది. ఇళ్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసినా బస్తాలకు బస్తాలు, టిన్లకు టిన్ల ఆహార వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కరోజు తినే ఆహారంలో సుమారు 19 శాతం ఆహారాన్ని వృథాగా పడేస్తున్నట్లు ఓ అంచనా.

యూఎన్‌ఈపీ ఆహార వ్యర్థాల సూచిక 2024 ప్రకారం.. రోజువారీ ఎక్కువ ఆహార వ్యర్థాలు వెలువడే దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇది నిజంగా ఆందోళనాకరం. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో రోజుకు కనీసం ఒక్కపూట ఆహారం దొరకని వారు కూడా కోట్లలో ఉంటారు.

ప్రపంచ ఆకలి సూచిక  2024 ప్రకారం.. 127 దేశాల్లో భారత్ ర్యాంకు 107. ప్రపంచ ఆకలి సూచిక  ప్రకారం.. 125 దేశాల్లో భారత్ ర్యాంకు 111వ స్థానం. ప్రపంచ ఆకలి సూచిక 2024లో ఆర్థికంగా మనకంటే వెనుకబడిన దేశాలైన నేపాల్ 68వ ర్యాంకు, శ్రీలంక 56వ ర్యాంకు, బంగ్లాదేశ్ 84వ ర్యాంకు సాధించాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. రోజుకు 26 శాతం మంది పేదలకు ఒక్క పూట అన్నం దొరకడం లేదు.

తిండి వృథా ఇలా..

భారత్‌లో ప్రతి సంవత్సరం 78.2 మిలియన్ టన్నుల ఆహారం వృథాగా చెత్తకుండీ లకు వెళ్తున్నదని ఐక్యరాజ్యసమితి గతేడాది ఆహార వ్యర్థాల సూచిక వెల్లడించింది. పట్ట ణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాం తాల్లో ఆహార తక్కువగా వృథా ఉన్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా దేశాలైన భూటాన్‌లో సంవత్సరానికి 19 కిలోల తలసరి ఆహార వ్యర్థాలు, పాకిస్థాన్‌లో 130 కిలోల తలసరి ఆహార వ్యర్థాలు బయటకు వస్తాయి.

భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాట క, కేరళ, ఉత్తరాఖండ్ , జార్ఖండ్‌లో కొంద రు పరిశోధకులు ఆహార వృథాపై అధ్యయ నం చేసి ‘మీడియం కాన్ఫిడెన్స్’ అనే పేరు తో సర్వే నిర్వహించారు. ఆయా రాష్ట్రా ల్లో ఆహారం వృథా ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఆకలి సమస్య తీవ్రంగా ఉ న్న 119 దేశాల జాబితాలో భారత్ ర్యాంకు ప్రతి సంవత్సరం 100కు పైగానే ఉంటోం ది.

ఆకలి సమస్య విషయంలో బంగ్లాదేశ్, నేపాల్‌ల కన్నా భారత్ దారుణ స్థితిలో ఉందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భారత్‌లో పిల్లల్లో పోషకాహార లోపమూ తీవ్రం గా ఉందని పేర్కొంది. ఆహార పదార్థాలను వృథా చేయడమే ఆకలి సమస్య పెరగడానికి అసలు కారణమని విశ్లేషకులు చెబుతు న్న మాట. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకా రం భారత్‌లో 40 శాతం వరకూ ఆహారం వృథా అవుతోంది.

ఈ ఆహారాన్ని డబ్బు రూపంలో మార్చితే, అది దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. భారత్‌లో తగినంత ఆహార పదార్థాల ఉత్ప త్తి జరుగుతున్నా అందరికీ అది చేరుకోవడంలేదని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ఒక అంచనా ప్రకారం భారత్‌లో 25 శాతం జనాభా ఆకలితో అలమటిస్తోం ది. సుమారు 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇందులో ఆహారం దొరకనివాళ్లు, దొరికినా పోషకాల లోపంతో బాధపడుతున్నవాళ్లూ ఉన్నారు.

పోషకాహారం అందక ఇబ్బందులు..

ప్రపంచ ఆహార సంస్థ ప్రకారం ఒక మనిషి వయసు, శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోలేకపోతే ఆ వ్యక్తి ఆకలితో ఉన్నట్టు లెక్క. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శక్తి, ప్రొటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందకపో తే దాన్ని ఆకలిగా పరిగణించొచ్చు. అయి తే దీనికి సంబంధించి మనదేశం ఒకేసారి వేర్వేరు సమస్యలను ఎదుర్కొంటోంది. 

దేశంలో ఓ వైపు పిల్లలు పోషకాహార లో పంతో బాధపడుతుంటే మరోవైపు మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహార సమస్య ఎన్నో ఏండ్లుగా వెంటాడుతుంటే గత పదేండ్లుగా పిల్లల్లో ఒబెసిటీ సమస్య పెరుగుతోంది. మరోపక్క అక్కడక్కడా ఆకలి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. పోషకాహార లోపంతో బాధ పడే పిల్లలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండి యా చాలాకాలంగా ముందు వరుసలో ఉంటోంది.

మారుమూల ప్రాంతాల్లో నివసించే చాలామందికి పౌష్టికాహారం గురిం చి సరైన అవగాహన లేకపోవడమే మాల్ న్యూట్రిషన్‌కు కారణం. దేశంలో చాలామంది కూరలు చేసుకోకుండా కేవలం పప్పు అన్నం లేదా చారన్నం లాంటివి తింటున్నారు. దీనివల్ల పుట్టే పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు రక్తహీనత ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు.

వలసలు కూడా ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం.  పోషకాహార లోపానికి మరో కారణం మహిళల్లో రక్త హీనత(ఎనీమియా). ఈ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య  ఏటా పెరుగుతోందని  తాజాగా విడుదలైన ‘గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్’, ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లు చెప్తున్నాయి. మన దేశంలో 15 నుంచి 49 ఏండ్ల వయసున్న మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు.  ఐదేండ్ల లోపు చిన్నారుల్లోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది.

వృథాను అరికట్టడం ఎలా?

వివాహంతో పాటు ఇతర శుభకార్యాల్లో భారీ మొత్తంలో ఆహారం వృథా అవుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ వృథాను అరికడితే భారత్‌లో తీవ్రమవుతున్న ఆకలి సమస్యను పరిష్కరించొచ్చు. వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త పాటించాలి. ఎంత తినగలమో అంతే వడ్డించుకోవాలి. ఒకవేళ పదార్థాలు మిగిలిపోతే వృథా చేయకుండా అన్నార్తులకు అందించాలి.

వివాహం, పార్టీ, హోటళ్లలో ఆహారాన్ని వృథా చేయకూడదు. వృథా అవుతున్న ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు వడ్డించే సంస్థలు కూడా ఇప్పుడు అందుబాటులో కి వచ్చేశాయి. దిల్లీలో జరిగే ఒక పెళ్లిలో అందరూ తినగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి 500 నుంచి 2,500 మం దికి అందించవచ్చని ఓ సంస్థ అంచనా వేసింది. సరఫరా వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల మధ్య సమన్వయం లోపించడం వల్లే ఆహార వృథా ఈ స్థాయిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఆహార పదార్థాలు వ్యవసాయ క్షేత్రాల నుంచి మార్కెట్లకు చేరుకుంటున్నాయి. కానీ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. సరఫరా వ్యవస్థ సరిగా లేదు. దీంతో ఆహార పదార్థాలు గోదాముల్లోనే కుళ్లిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సరఫరా వ్యవస్థలో లోపం కారణంగా కొన్నిసార్లు ధరలు కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

భారత్‌లో ఆహార వృథాను అరికట్టడం ప్రాధాన్యాంశమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఆహార ఉత్పత్తిలో భాగంగా ప్రతిరోజూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, కూలీలు పనిచేస్తారు. మనం ఆహారం వృథా చేయడమంటే వారందరి శ్రమను అగౌరవ పరిచినట్లే. మరోవైపు అనారోగ్య కారణాలు, వాయు కాలుష్యం, ఓజోన్ పొరకు రంధ్రం పడి అతినీల లోహిత కిరణాల ప్రభావం కంటే భవిష్యత్తు తరం ఆకలి బాధలు ఎదుర్కోబోతున్నాయనని అంతర్జాతీయ గణాంకాలను చూసి చెప్పవచ్చు.

ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి వివాహాలు, ఫంక్షన్లు, సభలు, సమావేశాల సందర్భంగా భోజనం ఏర్పాటు చేసే చోట జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎంతవరకు మనం విందు సిద్ధం చేయాలి. ఒకవేళ భోజనం వృథాగా మిగిలితే ఏం చేయాలి.. అనే అంశంపై ముందే ప్రణాళికలు రూపొందించుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ల యాజమాన్యాలు కూడా ఫుడ్ వృథాపై దృష్టిసారించాలి.