పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం.. పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టండి
రాహుల్‌గాంధీకి వీహెచ్ లేఖ
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంత రావు తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని కోరారు.
అంతే కాకుండా రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌కు కూడా లేఖలు రాసినట్లు వీహెచ్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టే బీసీ రిజర్వేషన్ల ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందినా.. పొందకపోయినా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
అంతే కాకుండా కేంద్రంలో కాంగ్రెస్‌లో అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామనే సంకేతం కూడా ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతుందన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినా బీసీలకు న్యాయం చేయడం లేదని వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో శ్రీరాముని కల్యాణం జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరుతానని చెప్పారు.




