ప్రపంచశాంతి స్థాపన అత్యంత కీలకం
- తెలంగాణ బుద్ధవనానికి ఎంతో ప్రాముఖ్యత
- శ్రీలంక మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి
నల్లగొండ, మార్చి 28(విజయక్రాంతి): ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని శ్రీలంక బుద్ధసేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి అన్నారు. శనివారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సేన్వి మాట్లాడుతూ భారతదేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గుర్తింపు, ప్రాచుర్యం పొంది న బుద్ధిష్టు మాన్యుమెంట్స్ ఉండడంతో బుద్ధవనం ఎంతో ప్రాముఖ్యత పొందిం దన్నారు. ప్రపంచంలో శాంతి అతి ముఖ్యమన్నారు.
బుద్ధిజం నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చని, శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ బుద్ధ శాంతి సమావేశం తనకు ఎంతో సంతృప్తిని, విశేష అనుభవాన్ని కలిగించిందన్నారు. బుద్ధవనం లాంటి ఆధునిక ప్రాజెక్టులు, నమూనాలను శ్రీలంకలో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పర్యటనలో 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, బిక్షుణీలు, విదేశీ ప్రతినిధులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్ల్లేపల్లి లక్ష్మయ్య, ఫౌండర్ మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి, నటుడు గగన్ మాలిక్, వియత్నాం ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ తిక్నాథ్ టు, నవ నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, శాసనసభ్యుడు రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.




