మా భవిష్యత్తు బాగుండాలంటే.. మీరు హెల్మెట్ ధరించాలి..
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): మా భవిష్యత్తు బాగుండాలంటే.. మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని గురువారం జిల్లాలోని బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ప్రారంభించారు.
గ్రామంలో సర్పంచ్ భూక్యా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 24 సీసీ కెమెరాలు ఎస్పీ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ద్విచక్ర వాహనదారులకు విద్యార్థుల చేత హెల్మెట్లు ఇప్పించి, ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా ఇంటికి చేరడం ద్వారా మా భవిష్యత్తుకు ఏలాంటి ఇబ్బంది ఉండదని పిల్లల చేత పెద్దలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామ ప్రజల రక్షణ కోసం సర్పంచ్ ప్రవీణ్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఎస్పీ సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్, ఎస్ ఐ తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




