అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు
- * పులుల సంరక్షణ తీరును పరిశీలించిన దౌత్యవేత్తల బృందం
- * పరిరక్షణ చర్యలు వివరించిన అటవీశాఖ అధికారులు
అచ్చంపేట మే 12:తెలంగాణ అటవీ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ బ్రాంచ్ సెక్రటేరియట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిగ్ క్యాట్ సంరక్షణ వరాప్లో భాగంగా వివిధ దేశాల నుండి వచ్చిన కాన్సులేట్ జనరల్స్, దౌత్య ప్రతినిధులు మంగళవారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను సందర్శించి జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. ప్రతినిధులు మన్ననూర్ జంగిల్ రిసార్ట్లో రాత్రి విడిది చేసి ఉదయం 6 గంటలకు సఫారీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని సహజ అటవీ అందాలు, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలను చూసి వారు ఆనందం వ్యక్తం చేశారని అటవీ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, హాబిటాట్ మేనేజ్మెంట్, ఎకో రిస్టోరేషన్ కార్యక్రమాలు, కమ్యూనిటీ భాగస్వామ్య చర్యలను ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రియాంక వర్గీస్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్ డైరెక్టర్ సునీల్ ఎస్ హిరామత్, నాగర్కర్నూల్ డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర, అమ్రాబాద్ ఎఫ్ డిఓ రామ్మూర్తి, ఎఫ్డిఓ రామ్మోహన్, రేంజ్ అధికారులు, ఫీల్ సిబ్బంది పాల్గొన్నారు. సందర్శన ద్వారా అంతర్జాతీయ ప్రతినిధులకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అమలు చేస్తున్న వన్యప్రాణి సంరక్షణ చర్యలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.






