కొత్త రికార్డు స్థాయికి ఫారెక్స్ 648.7 బిలియన్ డాలర్లకు చేరిన నిల్వలు
ముంబై, ఏప్రిల్ మే 24: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా మూడో వారమూ పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి చేరాయి. మే 17తో ముగిసిన వారంలో మరో 4.55 బిలియన్ డాలర్ల మేర ఎగిసిన ఫారెక్స్ నిల్వలు 648.7 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. అంతక్రితం మే3తో ముగిసిన వారంలో ఇవి 2.56 బిలియన్ డాలర్లు ఎగిసి 644.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఇవి 648.56 డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత అదే నెల చివరి మూడు వారాల్లో భారీగా తగ్గాయి. మళ్లీ తాజాగా ఆ స్థాయిని అధిగమించి కొత్త రికార్డుస్థాయిని నమోదు చేశాయి. రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం మే 17తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.361 బిలియన్ డాలర్ల వరకూ పెరిగి 569.009 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వలు పెరిగాయ్
దేశం వద్దనున్న బంగారం నిల్వలు సైతం సమీక్షావారంలో 1.244 బిలియన్ డాలర్ల మేర పెరిగి 57.195 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 113 మిలియన్ డాలర్ల వృద్ధితో 18.168 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు మాత్రం 168 మిలియన్ డాలర్లు తగ్గి 4.327 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.






