1 July, 2026 | 12:53 PM

బలపడిన రూపాయి

25-05-2024 01:27 AM

19 పైసలు పెరిగిన కరెన్సీ విలువ

ముంబై, మే 24: కొద్ది నెలలపాటు బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి శుక్రవారం ఒక్కసారిగా బలం పుంజుకున్నది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 19 పైసలు పెరిగి 83.10 వద్ద ముగిసింది. 83.26 వద్ద ప్రారంభమైన రూపాయి 83.03 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆర్బీఐ భారీ డివిడెండుతో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గుతుందన్న అంచనాలు, బాండ్ ఈల్డ్స్ తగ్గుదల కారణంగా దేశీయ కరెన్సీ పెరిగిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. 

మరింత పెరిగే ఛాన్స్

ఆర్బీఐ భారీ డివిడెండు మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపర్చడంతో రూపాయి ర్యాలీ జరిపిందని బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు.  వచ్చే కొద్ది రోజుల్లో రూపాయి 82.80 శ్రేణిలో ట్రేడ్‌కావొచ్చని అంచనా వేశారు. గురువారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో భారీ పెట్టుబడులు చేయడం, ఆర్బీఐ డివిడెండు స్థానిక కరెన్సీ పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.  సమీప భవిష్యత్తులో డాలరు మారకంలో రూపాయి విలువ 83 స్థాయిని బ్రేక్‌చేస్తే 82.86 వరకూ బలపడే అవకాశం ఉన్నదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితితో ఈ ఏడాది తొలినాళ్లలో రూపాయి మారకపు విలువ రికార్డు కనిష్ఠస్థాయి ౮౩.౮౦ వద్దకు పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లను విక్రయించడంతో మరింత పతనం కాకుండా నిలవగలిగింది.