calender_icon.png 1 May, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెటూరు.. పట్నమైంది!

24-04-2025 01:11:32 AM

వేం నరేందర్‌రెడ్డి కృషితో కేసముద్రం సమగ్రాభివృద్ధి

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పాటు

అగ్నిమాపక కేంద్రం.. 50 పడకల ఆసుపత్రి మంజూరు 

రూ.25 కోట్లతో రోడ్ల విస్తరణ.. సెంట్రల్ లైటింగ్

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సలహాదారుడు, వేం నరేందర్రెడ్డి మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, వేం నరేందర్రెడ్డి సన్నిహిత సహచరులుగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే వేం నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఏడాది కాలంలోనే వేం నరేందర్రెడ్డి తన సొంత మండలం అయిన కేసముద్రాన్ని పట్నంగా మార్చేందుకు నడుం బిగించారు. తొలుత మేజర్ పంచాయితీగా ఉన్న కేసముద్రం స్టేషన్ తో పాటు శివారు గ్రామాలు కేసముద్రం విలేజ్, ధనసరి, అమీనాపురం, సబ్ స్టేషన్ తండ జీపీలను కలిపి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 

విద్యావైద్యంపై ప్రత్యేక దృష్టి

విద్యాపరంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక చొరవ చూపిన నరేందర్రెడ్డి.. కేసముద్రం మండలానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు డిగ్రీ కళాశాలను సైతం మంజూరు చేయించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. ఇక రవాణా పరంగా ఇబ్బందులు లేకుండా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ తోపాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రూ.20 కోట్లు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టారు.

నలభై కోట్లతో కేసముద్రం పట్టణం నుండి అర్పణపల్లి వరకు రోడ్డు విస్తరణ, వట్టి వాగుపై హై లెవెల్ వంతెన మంజూరు చేయించారు. ఇక ఇదే తరహాలో పట్టణంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా సింగిల్ రోడ్డుగా ఉన్న బైపాస్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి ఐదు కోట్లు మంజూరు చేయించి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. కేసముద్రం పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 132 కేవి విద్యుత్ ఉప కేంద్రం, అలాగే కేసముద్రం పట్టణ విద్యుత్ సమస్య పరిష్కారం కోసం అధనంగా 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేయించారు. వీటికి తోడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి కేసముద్రం పట్టణం ద్వారా ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభింపజేశారు. 

సంక్షేమ కార్యక్రమాల పరంపర

ఇక సంక్షేమపరంగా రూ.1.50 కోట్లతో పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.80 లక్షలతో ముస్లింలకు షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అలాగే పట్టణంలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి రూ.90 లక్షలు మంజూరు చేయించారు. త్వరలో పట్టణంలో మినీ స్టేడియం, ప్రస్తుతం ఉన్న ఆర్‌అండ్బీ విశ్రాంతి భవనాన్ని మెరుగుపరచడం, మోడల్ మార్కెట్ ఏర్పాటు, నూతనంగా మంజూరైన విద్యాసంస్థలు, కార్యాలయాల భవన నిర్మాణాలకు అవసరమైన నిధులను కేటాయించడానికి కృషి చేస్తున్నారు.

సీఎం సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి ఏడాది కాలంలోనే తన సొంత మండలమైన కేసముద్రం సమగ్రాభివృద్ధికి ఊహించని విధంగా బాటలు వేశారు. భవిష్యత్తులో కేసముద్రం పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు వేం నరేందర్రెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.