గజ్వేల్‌లో మాట్లాడుతున్న మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి

29-04-2024 01:22:52 AM

కేసీఆర్ నా స్నేహితుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న

హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్28 (విజయక్రాంతి): నైతిక విలువలు లేని మాజీ సీఎం కేసీఆర్ నా స్నేహితుడని చెప్పుడకోవడానికి సిగ్గుపడుతున్నానని హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. గజ్వేల్‌లో సిద్దిపేట డీసీసీ  అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూంరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి అక్రమాలతో అమరుల ఆత్మసైతం క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో తప్పు చేసినా ప్రజలు క్షమించారని, అయితే పరిపాలనలో మాత్రం తప్పు చేస్తే ఉపేక్షించరని అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైందన్నారు. అవినీతిపరులు, ఉద్యమ ద్రోహులతో బీఆర్‌ఎస్ పార్టీ నిండిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన రక్తం ధారపోశానని, అయితే ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టంగా మారిందన్నారు. నేతల మధ్య విబేధాలు సృష్టించి తగవులు పెట్టిన కేసీఆర్ చివరకు కష్టాలు కొనితెచ్చుకున్నారన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసగించిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టింస్తుండడం చూడలేక కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి మాట్లాడుతూ మదన్‌రెడ్డికి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేసీఆర్ తీరని ద్రోహం చేశారన్నారు. పంట రుణమాఫీ చేస్తానని పదేండ్ల పాటు రైతులను మోసం చేసిన కేసీఆర్ మోసాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో సంతోషం కలిగిందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్‌రావులకు కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపించారు. ముదిరాజ్ బిడ్డ, బలహీన వర్గాల నాయకుడు నీలం మధును గెలిపించి ఇక్కడి నిర్వాసిత రైతుల పొట్టకొట్టిన వెంకట్రామ్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, ఆయా మండలాల పార్టీ బాధ్యులు మల్లారెడ్డి, సందీప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.