మాయమాటలు చెప్పను..

29-04-2024 01:21:43 AM

గెలిచిన వెంటనే రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తా

యువతకు అండగా నిలబడతా 

మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): అందరిలా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయనని.. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే వెంటనే రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలందిస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బరుపేట మండలంలో పీవీఆర్ ట్రస్ట్ వలంటీర్స్‌తో నిర్వహించిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమం జోరందుకుందని, నాడు మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావుల సహకారంతో దుబ్బాక నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. గెలిచిన 30 రోజుల్లోనే ట్రస్టు ఏర్పాటు చేసి యువతకు అండగా నిలుస్తానన్నారు.

ఉప ఎన్నికల్లో ఎడ్లబండి, నిరుద్యోగ భృతి, పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేసిన వారితో ప్రజలు తనను పోల్చవద్దన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నామమాత్రమేనని పేర్కొన్నారు. కలెక్టర్‌గా ఇక్కడి ప్రజలతో మమేకమై పనిచేశానని గుర్తుచేశారు. 15 రోజులు తన కోసం పనిచేస్తే.. ఐదేళ్లు అండగా ఉంటానని వివరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ట్రస్ట్ వలంటీర్లు పాల్గొన్నారు.