రేవంత్‌తోనే చేనేత సంక్షోభం

29-04-2024 01:23:49 AM

ఎమ్మెల్సీ ఎల్ రమణ

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకపోవడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ కారణమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాట్లాడుతూ... హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్రపరిశ్రమపై ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తామని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. చేనేత కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి కుటుంబానికి రూ.50వేలు రుణం అందించారని.. దసరా, బతుకమ్మ పండగలకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతలకు అండగా నిలిచారని ప్రశంసించారు.

అదే విధంగా నెలకు రూ.2వేల పెన్షన్, బీమా ద్వారా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తూ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నంలో రేవంత్‌రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేనేత కార్మికులకు సూచించారు. చేనేత ఆకలి చావులకు సీఎం, సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టెండర్లు వేసి పనులు పూర్తి చేసి వాటికి ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని, రేవంత్‌రెడ్డి బీసీలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఏ వర్గాలు అంటే ప్రేమ ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసనని, కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించింద న్నారు. వెంటనే చేనేతలకు వర్క్ అర్డర్ పెంచి కేసీఆర్ హయాంలో ప్రకటించిన పథకాలు, ప్రోత్సహకాలు కొనసాగించాలన్నారు.