12 March, 2026 | 5:05 AM

కేసీఆర్ కట్టిస్తే.. కూల్చేస్తుండు!

12-03-2026 01:38 AM

నిరుపేదలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది..

మూసీ పేర పేదోళ్ళ ఇండ్లు కూల్చేసిండు..

కొల్లూరు ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి, మార్చి 11(విజయక్రాంతి/పటాన్చెరు: నిరుపేదల కోసం కేసీఆర్ ఇండ్లు కట్టిస్తే...రేవంత్రెడ్డి కూల్చేస్తున్నాడని, నిరుపేదలకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని బీఆ ర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్రావు హామీనిచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూంలలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, మహిళా దినోత్సవం వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ తెలంగాణలో హిందువులు, ముస్లిం సోదర భావంతో కలిసి మెలిసి ఉంటారని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుందని, ప్రపంచం అంతా  ఆందోళనలో ఉన్నారని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. యుద్ధం ముగిసిపోవాలని రంజాన్ మాసంలో అల్లాను వేడుకోవాలని కోరారు.

కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో దావత్ ఏ ఇఫ్తార్ ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దేనన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్లు రాబోతున్నాయని, కేసీఆర్ శాసనసభలోనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానం చేశారన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టడా..కూల్చుడు తప్ప కట్టుడు లేదని, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుంటాడని తెలిపారు.

మూసి అంటాడు.. పెదోళ్ళ ఇండ్లు కూలగొట్టాడని, ఖమ్మంలో సైతం 900 ఇండ్లు కూలగొట్టారని విమర్శించారు. ప్రస్తుతం పారిశ్రామిక భూముల మీద పడ్డాడని ఆరోపించారు. ఇండ్లు కూలగొట్టుడు అయిపోయిందని, ఇప్పుడు గుడులు కులగొడుతున్నాడని, శ్యామల దేవి అమ్మవారి ఆలయం కూడా కూల్చేస్తామని చెబితే తాను వెళ్ళి నిలదీయడంతో ఆపివేశారని గుర్తు చేశారు. శాసనసభలో కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యలు లేవనెత్తుతామన్నారు. మీకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. 

ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇప్పటినుండి ఇంకో లెక్క... పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

గత రెండేళ్లలో పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని.. ఇప్పటిదాకా ఒక లెక్క అని ఇప్పటి నుండి మరో లెక్క అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆధునిక వసతులతో అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిరుపేదల కోసం కేసీఆర్ ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నాడు కెసిఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప.. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసింది ఏమీ లేదని విమర్శించారు.

పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం 475 కోట్ల రూపాయలు కేటాయిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేయడం జరిగిందని అన్నారు. ఇళ్లల్లో నివాసం ఉండడం లేదంటూ కుంటి సాకులతో ఇళ్ల పట్టాలను రద్దు చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను విక్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, మాణిక్ యాదవ్, నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

హరీష్రావుతో ఒకే వేదికపై జీఎంఆర్..

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రెండేళ్ళ తర్వాత ఒకే వేదికపై హరీష్రావుతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన బీఆర్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలిగా మళ్ళీ గూడెం మహిపాల్రెడ్డి బీఆర్‌ఎస్కు దగ్గరవడంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. అందులో భాగంగానే ఇప్పటిదాకా ఒక లెక్క...ఇప్పటి నుండి మరోలెక్క అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇస్నాపూర్ చైర్మన్ ఎంపికలో ఎక్స్ అఫిషియో ఓటును ఎంపీ రఘునందన్రావుతో కలిసి వేశారు. అప్పుడు కూడా బుల్లెట్ దిగిందా లేదా అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.