12 March, 2026 | 10:22 AM

గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ పంజా

12-03-2026 01:39 AM
  1. కేటుగాళ్ల కొత్త తరహా మోసాలు
  2. అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): నిత్యవసర వస్తువైన వంటగ్యాస్ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఒక ఆయుధంగా మారింది. గ్యాస్ బుకింగ్, సబ్సిడీ అప్డేట్, ఈ-కేవైసీ పేరుతో సామాన్యుల బ్యాంక్ ఖాతా లను కేటుగాళ్లు గుల్ల చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి మోసాలు విపరీతంగా పెరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముందుగా వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఒక సందేశం లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది.

మీ గ్యాస్ కనెక్షన్ బ్లాక్ చేయబడింది లేదా మీ ఈ-కేవైసీ గడువు ముగిసింది.. వెంటనే అప్డేట్ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుందిఅంటూ భయపెడతారు. ఆ సందేశం కిందే ఒక లింక్ లేదా ఒక ఏపీకే  ఫైల్‌ను పంపిస్తారు. వినియోగదారులు ఆందోళనతో ఆ లింక్ను క్లిక్ చేయగానే, అది గ్యాస్ ఏజెన్సీ అధికారిక వ్బుసైట్ను పోలి ఉండే నకిలీ పేజీకి తీసుకువెళుతుంది. కొన్ని సందర్భాల్లో నిందితులు ఫోన్ చేసి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులమని నమ్మిస్తారు.

మీ ఫోన్లో ఏదైనా అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయమని కోరుతారు. ఒక్కసారి ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేస్తే, మీ ఫోన్ స్క్రీన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. మీరు బ్యాంక్ వివరాలు నమోదు చేస్తున్నప్పుడు లేదా ఓటీపీలు వస్తున్నప్పుడు వారు సులభంగా గమనించి, మీ ఖాతాలోని సొమ్మును వేరే ఖాతాలకు మళ్లిస్తారు. మరికొన్ని సార్లు బుకింగ్ ఛార్జీ పేరిట కేవలం పది రూపాయలు చెల్లించమని కోరుతూ మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించి నిలువునా ముంచుతున్నారు.

అమాయక ప్రజలు ఈ మాయమాటలు నమ్మి తమ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్ల చేతిలో పెడుతున్నారు.  గ్యాస్ బుకింగ్ కోసం ఎప్పుడూ సంబంధిత కంపెనీల అధికారిక మొబైల్ అప్లికేషన్లు లేదా వారి అధికారిక వ్బుసైట్లను మాత్రమే ఉపయోగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే ఎటువంటి లింకులను గానీ, ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయవద్దని చెపుతున్నారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ లేదా పిన్ నంబర్లను ఎవరికీ చెప్పొద్దని, కనెక్షన్ గురించి ఏదైనా సందేహం ఉంటే నేరుగా మీ గ్యాస్ డీలర్ కార్యాలయానికి వెళ్లాలని చెపుతున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.