30 March, 2026 | 9:15 AM

విద్యావంతుడా? బ్లాక్ మెయిలరా?

05-05-2024 01:58 AM

ఎవరిని గెలిపిస్తారో తేల్చుకోండి

బీడీలపై పుర్రె గుర్తు కాంగ్రెస్ ఘనత

బీడిలపై పన్ను విధించింది బీజేపీ 

అడ్డిమార్ గుడ్డి దెబ్బ సీఎంగా రేవంత్     

దుబ్బాక రోడ్‌షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, మే 4 (విజయక్రాంతి): మెదక్ పార్లమెంటు సభ్యుడిగా విద్యావంతుడు గెలవాలా.. బ్లాక్ మెయిలర్ గెలవాలా? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా దుబ్బాక, నారాయణరావుపేట రోడ్‌షోలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంక ట్రామిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దుబ్బాక ప్రాంతంలో అత్యధిక మహిళలు బీడీలు చుడుతూ ఉపాధి పొందుతారని, అలాంటి వాళ్లకు నష్టం కల్గించి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీడి కట్టలపై పుర్రె గుర్తు పెడితే, బీజేపీ బీడిలపై పన్ను విధించిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ మాత్రం బీడీ కార్మికులకు నిబంధనలు లేకుండా పెన్షన్ ఇచ్చారని స్పష్టంచేశారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకొవడమేనని హితవు పలికారు.

మెదక్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరగాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ దుబ్బాకలో చదువుకున్నాడని, ఈ ప్రాంతం ప్రజల కష్టలు తెలుసుకాబట్టే బీడి కార్మికులకు ప్రత్యేక గుర్తింపుతో పెన్షన్ ఇచ్చారని చెప్పారు. అడ్డిమార్ గుడ్డి దెబ్బాగా సీఎం అయిన రేవంత్ రెడ్డి.. రైతుబంధు , రుణమాఫీ, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, 24 గంటల కరెంట్ బంద్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మాజీ సీఎం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి అంత అహం ఎందుకని ప్రశ్నించారు. రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేసి సేవ చేస్తానని ముందుకొచ్చిన బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక రోడ్‌షో సందర్భంగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో హరీశ్‌రావు కిందికి దిగి రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దుబ్బాక పోలీసుల పనితీరు పట్ల ప్రజలు ఆసహనం వ్యక్తంచేశారు.