18 July, 2026 | 2:51 PM

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు

18-07-2026 02:51 PM

బూత్ స్థాయి నుంచే బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి

– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం టూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) తన నివాసంలో సమావేశమై బీఆర్ఎస్ సభ్యత్వం, పార్టీ సంస్థాగత బలోపేతం, ఎస్‌ఐఆర్ కార్యక్రమం, సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కార్యాచరణపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లు అన్యాయంగా తొలగించబడకుండా ప్రతి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

పార్టీ కోసం కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకే భవిష్యత్తులో సంస్థలో సముచిత గుర్తింపు, పదవులు, బాధ్యతలు లభిస్తాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చే వారికంటే, పార్టీ కష్టసమయంలో జెండా మోసిన కార్యకర్తల సేవలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని, బూత్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

ఎస్‌ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదును ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి ప్రతి కుటుంబాన్ని పార్టీతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం టూ టౌన్ బీఆర్ఎస్ పార్టీకి కీలకమైన ప్రాంతమని, ఇక్కడ సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్‌ను బలమైన సంస్థాగత యూనిట్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.

యువత, మహిళలు, విద్యార్థులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తల మధ్య ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణే పార్టీ విజయానికి బలమని పేర్కొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రతి కార్యకర్త పార్టీ విజయమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.