కందనూల్ కుటుంబాన్ని ఇడిషి పోయేదే లేదు.!
పుకార్లు నమ్మొద్దు గెలిచినా ఓడినా మీ వెంటే.
కెసిఆర్ సంక్షేమ పథకాలను ఆపాలని చూస్తే సహించం.
స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్ కి కూడా సరిపోడు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): అమితంగా ఆదరించే కందనూలు కుటుంబాన్ని కాదని మరెక్కడికి పోయే ప్రసక్తే లేదని కొంతమంది స్వార్థపరులు అచ్చంపేటకు వెళ్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని వాటిని ఎవరు నమ్మద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే కుట్రను మానుకోవాలని హెచ్చరిస్తూ చేపట్టిన నిరసన ధర్నాలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కనీసం సర్పంచ్ పదవికి కూడా సరిపోడని ఎమ్మెల్యే స్థాయిలో పరిపాలించే సత్తా తనకు లేదన్నారు.
స్థానిక పోలీసులు సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా పనిచేస్తున్నారని నేరుగా కాంగ్రెస్ కండువా ధరిస్తే ప్రజలు ఎవరూ వారి వద్దకు వెళ్లరని చురకలు అంటించారు. అక్కడే విధుల్లో ఉన్న సిఐ అశోక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నీది చాలా ఎక్కువ అయింది. అంటూ హెచ్చరికలు జారి చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోల వాతావరణం నెలకొంది. మొదట గాంధీ పార్క్ వేదికగా ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించి అనంతరం జనరల్ ఆస్పత్రి ప్రధాన రహదారి నీదే ధర్నా చేపట్టడంతో గంటల తరబడి సామాన్యులు ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.






