రైస్‌మిల్లర్లపై విజిలెన్స్ కొరడా
- ప్రభుత్వానికి 400 కోట్ల బకాయి
- మిల్లుల్లో చూస్తే గింజ లభించలే
- అవాక్కైన అధికారులు, కేసు నమోదు
- తనిఖీలు, కేసులను తప్పించేందుకు యాజమానుల తంటాలు
- పరిస్థితిపై ‘విజయక్రాంతి’ ప్రతినిధితో వాపోయిన ఓ వ్యాపారి
కామారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యాన్ని అందజేయని రైస్‌మిల్ యజమానులపై సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడల్లో తనిఖీలు చేపట్టి రైస్‌మిల్లర్ల యాజమానులపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రూ. 400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. గత నాలుగేళ్లుగా 8 సీజన్లకు సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి అప్పగించలేదు.
దీంతో ప్రభుత్వం సీరియస్ అయిం ది. చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొందరు అధికారులతో చేతులు కలిపిన రైస్ మిల్లర్లు ఈ చర్యలను అడ్డుకోగలిగారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 60కిపైగా రైస్‌మిల్లర్లు 400 కోట్లకు పైగా ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ప్రభుత్వాదేశాల మేర కు వచ్చిన అధికారులు కామారెడ్డిలోని ఓ పేరు మోసిన వ్యాపారి మిల్లును తనిఖీ చేయగా ప్రభుత్వానికి అప్పగించాల్సిన రూ. 7.50 కోట్ల బియ్యంలో గింజ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు.
కేసు నమోదు చేసినట్లు సమాచా రం. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడంతో మరికొన్ని రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు వెనుదిరిగారు. బాన్సువాడలో ఒక మిల్లులో తనిఖీ చేయగా రూ. 50 లక్షల బియ్యం, నిజామాబాద్‌లో ఓ యాజమాని రూ. 90 లక్షల బియ్యం బకాయి ఉన్నట్లు గుర్తించారు. కాగా కేసులపై ఎలా ముందుకు వెళ్లాలని మిల్లర్లంతా ఆదివారం జిల్లా కేం ద్రంలో సమావేశమైనట్లు తెలుస్తుంది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకొని గండం నుంచి గట్టెక్కాలని, లేకుంటే ఆస్తులు జప్తు కావడం ఖాయమని ఓ మిల్లు యాజమాని ‘విజయక్రాంతి’ దినపత్రిక ప్రతినిధితో వాపోవడం గమనార్హం.






