27 July, 2026 | 3:12 AM

గాజుల అలంకరణలో వనదుర్గమ్మ

27-07-2026 02:24 AM

ఆషాడ మాసం.. ఏడుపాయల్లో భక్తజన సందోహం 

రంగురంగుల గాజుల అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చిన అమ్మవారు 

డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలతో బోనాలు, ఒడిబియ్యం సమర్పణ

పాపన్నపేట, జులై 26: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం.. మంజీరా నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. ఆధ్యాత్మిక వాతావరణం, ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, బండరాళ్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నామనిపించే అనుభూతి.. ఇది పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం సొంతం. 

ఆషాడ మాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని వనదుర్గామాతను వివిధ రంగుల గాజుల అలంకరణలో విశేషంగా అలంకరించారు. వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రంగుల గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజుల అలంకరణలో అమ్మవారు శోభాయమానంగా భక్తులను దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసిపోయింది.

ముందుగా భక్తులు మంజీరా నదీ పాయలు, చెక్ డ్యామ్ లో పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనం చేసుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలతో బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. మమ్మేలు మాయమ్మా.. ఏడుపాయల వనదుర్గమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.