మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి సేవలు మరువలేనివి
ఈ నెల 4న దివంగత జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ
హాజరుకానున్న డిప్యూటీ సీఎం, టీపీసీసీ అధ్యక్షులు
విలేకరుల సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దివంగత మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం కోసం అధికారంలో ఉన్నా లేకున్నా జగదీశ్వర్ రెడ్డి పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థిదశ నుంచి రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి కొల్లాపూర్ నుంచి నారాయణపేట, అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసినట్లు తెలిపారు. ఈనెల 4న జిల్లా కేంద్రం పద్మావతీకాలనీలోని గ్రీన్ బెల్టులో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి విగ్రహాష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణ రావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.






