19 March, 2026 | 2:29 AM

సుగంధ రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించండి

19-03-2026 12:49 AM

జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ మెంబర్ సాంబశివరెడ్డి 

మంగపేట, మార్చి 18 (విజయక్రాంతి) : సుగంధ పంటలు సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు అవసరమైన పథకాల అమలుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ  స్పుసైస్ బోర్డు వరంగల్ రీజనల్ నూతన డిప్యూటీ డైరెక్టర్ రామన్నను జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కోరారు.

కేరళ రాష్ట్రం నుండి బదిలీపై వచ్చి వరంగల్ స్పుసైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్పుసైస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రామన్నకు సాంబశివరెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుగంధ, వాణిజ్య పంటగా మిర్చి పెద్ద ఎత్తున సాగు అవుతుందని మిర్చి రైతుల కోసం స్పుసైస్ బోర్డు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విరివిగా వివిధ పథకాల కింద నిధులు మంజూరు అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని స్పుసైస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రామన్నను ఈ సందర్భంగా సాంబశివరెడ్డి కోరారు.

ఆర్థిక చేయూతతో పాటు సాంకేతిక సాగు పద్ధతులను ప్రోత్సహించేలా నిధులు మంజూరు చేయాలని, పసుపులో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధన స్థానం నుండి నూతన పసుపు వంగడాల విత్తనాలను రైతులకు పంపిణీ చేసేందుకు స్పుసైస్ బోర్డ్ తో కలిసి పని చేయుటకు తమ ఎఫ్పిఓ సిద్ధంగా ఉందని ఇందుకోసం ములుగు జిల్లాని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించాలని సాంబశివరెడ్డి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పుసైస్ బోర్డు రీజనల్ సెమినార్ నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా నూతన స్పుసైస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ రామన్న వివిధ పథకాల నిధులు కోసం బోర్డు ప్రధాన కార్యాలయానికి కార్యాచరణ పంపిస్తామని, నిధులు మంజూరు కాగానే అమలు చేస్తామన్నారని, అదే విధంగా త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానని తెలిపారని సాంబశివరెడ్డి తెలిపారు.