30 August, 2026 | 7:57 PM

ఘనంగా పోచమ్మ జాతర

30-08-2026 07:25 PM

భక్తిశ్రద్ధలతో బోనాల కొలుపు

తెలంగాణ సాంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా పోచమ్మ జాతర

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలో ఆదివారం పోచమ్మ జాతర భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. నస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటి అధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ల ఆద్వర్యలో తెలంగాణా సాంస్కృతి, ఆచార సాంప్రదాయాలతో పూజారి సాగర్ పంబాల గురుస్వామిచే ఫోచమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

1000 మంది కార్మిక కుటుంబాల మహిళలు తెలంగాణా సాంస్కృతిలో బాగంగా బోనాలు నెత్తినబూని పోచమ్మ ఆలయానికి డప్పూ చప్పుల్లతో, పోతరాజుల నృత్యాలతో, అమ్మవార్ల దేవుడి పూనకాలతో శోభాయాత్రగా చేరుకున్నారు. ముందుగా మహిళలు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉండాలని, పజలను అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ కార్పొరేటర్ బండారి సుధాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా పోచమ్మ తల్లి అమ్మవారికి మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతు బోనాల పండుగ, పోచమ్మ జాతరలు తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.

ఆధునిక కాలంలోనూ పట్టణ ప్రజలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను కొనసాగిస్తూ జాతరలను నిర్వహించడం విశేషమన్నారు. యువత కూడా ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కాలనీ వాసులు తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.