ఘోర ప్రమాదం.. నవ దంపతులతో సహా నలుగురు మృతి
కేరళ: శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొనడంతో ఆదివారం తెల్లవారుజామున పతనంతిట్ట జిల్లాలో నవ దంపతులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పునలూర్-మువట్టుపుజా రాష్ట్ర రహదారిపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ప్రయాణికులను ధ్వంసమైన వాహనం నుంచి బయటకు తీశారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టిందని, బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. గత నెలలో వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్‌కి మలేషియా వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధితుల నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






