21-11-2025 02:06:11 PM
గుజరాత్: గోధ్రా పట్టణంలో( Godhra town) ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో వచ్చిన పొగను పీల్చుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఊపిరాడక మరణించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్య గంగోత్రి నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మృతులు ఆభరణాల వ్యాపారి కమల్ దోషి (50), అతని భార్య దేవల్బెన్ (45), వారి కుమారులు దేవ్ (24), రాజ్ (22)గా గుర్తించినట్లు డివిజన్ పోలీస్ స్టేషన్ అధికారి ఆర్‌ఎం. వాసయ్య తెలిపారు. వారు నిద్రలోనే మరణించారని వెల్లడించారు.
ఈ కుటుంబం అతని కుమారులలో ఒకరి నిశ్చితార్థానికి సిద్ధమవుతోంది. వారు శుక్రవారం ఉదయం వాపికి బయలుదేరాల్సి ఉందని స్థానికులు తెలిపారు. ఈ విషాద ఘటనపై గోద్రాలోని సివిల్ హాస్పిటల్ వైద్యాధికారి సందీప్ శర్మ మాట్లాడుతూ.. "ఈరోజు ఉదయం 7:30 గంటలకు, ఒక ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇంట్లోని 4 మందిని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. దర్యాప్తులో, వారందరూ చనిపోయినట్లు తేలింది. ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరణానికి ప్రాథమిక కారణం మంటలు, ఊపిరాడకపోవడమే, కానీ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత కారణం నిర్ధారించబడుతుంది." అని వైద్యాధికారి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.