calender_icon.png 19 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ వ్యవహారం వివాదం – యువతిపై సుత్తితో దాడి

19-02-2026 06:02:17 PM

తీవ్ర గాయాలతో హైదరాబాద్‌కు తరలింపు – కేసు నమోదు

చివ్వెంల, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రేమ వ్యవహారం వివాదం నేపథ్యంలో యువతిపై ఇనుప సుత్తితో దాడి జరిగిన ఘటన చివ్వెంల మండల పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన (27), తండ్రి కిష్టయ్య, ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని. ఆమె ఇటీవల స్నేహనగర్ కుడకుడ గ్రామంలో నివసిస్తున్న తన అక్క–బావ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చి ఉండేది.

ఈ నేపథ్యంలో లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేశ్ అనే వ్యక్తి ప్రేమ వ్యవహారం విషయమై ఈరోజు (ఫిబ్రవరి 19) ఉదయం సుమారు 9.15 గంటల సమయంలో స్పందన ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గమనించాడు. ముందస్తు పథకం ప్రకారం సమీపంలోని షాపులో ఇనుప సుత్తె కొనుగోలు చేసి ఆమె వద్దకు వెళ్లి ప్రేమ విషయం పై గొడవకు దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో తన వద్ద ఉన్న సుత్తితో ఆమె తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. యువతి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి బావ పూల బాబు రావు నుండి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. నేర స్థలాన్ని డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ మరియు క్లూస్ టీం సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.