9 June, 2026 | 2:32 AM

పేదలకు ఉచిత, నాణ్యమైన విద్యా-వైద్య సేవలు అందించాలి

09-06-2026 12:26 AM

సీపీఎం నేత భూపాల్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతున్నాయని, ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. దీంతో పేద ప్రజలు ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని హక్కులుగా అమలు చేయాలని, వాటిని వ్యాపార వస్తువులుగా మార్చే విధానాలను విరమించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్, కుమార్, గోడిసెల కార్తీక్, నాయకులు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.