22 July, 2026 | 11:04 PM

ఎరువులు నిర్ణీత ధరలకు అందుబాటులో ఉంచాలి

22-07-2026 09:55 PM

అక్రమాలపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో రైతులకు ఎరువులు నిర్ణీత ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, యూరియాను అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమంగా నిల్వ చేసి విక్రయించడం వంటి చర్యలను కఠినంగా అరికడతామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో పాటు ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడిన దుకాణాల అనుమతులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగినంత ఎరువుల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలను విస్తరించి రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు.

మండలాల వారీగా ఎరువుల వినియోగంపై సమగ్ర నివేదిక అందజేయాలని, రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియాను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వాలియా నాయక్, భూపాలపల్లి, మహదేవపూర్ వ్యవసాయ విభాగ అధికారులైన రమేష్, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.