మద్యం మత్తులో కారు బీభత్సం
బైక్, ఆటోను ఢీకొట్టిన కారు
బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు ముందుగా ద్విచక్ర వాహనాన్ని, అనంతరం ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో రెండు వాహనాలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోచయ్య, ఆటో డ్రైవర్ ఐలయ్య గాయపడగా, 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బెజ్జంకి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మద్యం మత్తులోనే ప్రమాదం
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన రామగిరి అగ్ని మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్సై తిరుపతి తెలిపారు. బాధితుడి బంధువు కనగండ్ల తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.






