లేని చెక్‌పోస్టుల్లో ఉద్యోగాలు!
- వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల వింత పరిస్థితి
- 2017లో జీఎస్టీ రావడంతో చెక్‌పోస్టుల ఎత్తివేత
- దాదాపు 500 మందిని ఇతర శాఖలకు కేటాయింపు
- అప్పటి నుంచి సర్వీస్ రూల్స్ లేకుండానే విధులు
- ప్రభుత్వానికి సరెండర్ కాకుండానే అనధికారికంగా విధులు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో చెక్‌పోస్టు ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఏడేళ్లుగా ఎలాంటి సర్వీస్ రూల్స్ లేకుండా వీరు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు డిపార్ట్‌మెంట్‌లో ఏం విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల చెక్‌పోస్టు ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌పై కాగ్ వాణిజ్య పన్నుల శాఖను వివరణ కోరినట్టు తెలిసింది. దీంతో వీరి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
వాస్తవానికి శ్రీదేవి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెక్‌పోస్టు ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అంశాన్ని చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు? ఎంతమంది రిటైర్ అయ్యారు? అనే విషయాలపై నివేదికను కూడా తయారు చేసినట్లు ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ఈ అంశం మరుగున పడినట్టు వారు చెప్తున్నారు.
చెక్ పోస్టులు లేకున్నా.. అక్కడే పని చేస్తున్నట్టు..
తమకు సర్వీస్ రూల్స్ లేకపోడవం వల్ల ఆయా విభాగాల్లో సెకండ్ గ్రేడ్ ఉద్యోగులుగా మిగిలిపోయామని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. చెక్ పోస్టులు ఉన్నప్పుడు తమకు గుర్తింపు ఉండేదని, ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చెక్‌పోస్టులు లేకున్నా.. వారు ఇంకా అందులోనే పని చేస్తున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ అంశంపైనే ఇటీవల కాగ్ అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. చెక్ పోస్టులు లేకున్నా వారు అందులో ఎలా పని చేస్తున్నారని? కాగ్ వివరణ కోరినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులు
తెలంగాణలో గతంలో 14 వరకు సరిహద్దు చెక్ పోస్టులు ఉండేవి. వాహనాల్లో సరుకు రవాణాకు సంబంధిం చిన వే బిల్లులు, వ్యాట్‌ను వసూలు చేసుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఉద్యోగులు ఈ చెక్ పోస్టుల్లో విధులు నిర్వహించేవారు. కమర్షియల్ ట్యాక్స్ విధానంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2017లో కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చింది. దీని వల్ల సరుకును లోడ్ చేసేటప్పుడే జీఎస్టీ, వ్యాట్ చెల్లించడంతో చెక్‌పోస్టులతో పనిలేకుండా పోయింది. దీంతో చెక్‌పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను వా ణిజ్య పన్నుల శాఖలోని వివిధ విభాగాలకు పంపించారు. చెక్‌పోస్టుల్లో ఇదివరకు పని చేసినవారు దాదాపు 450 నుంచి 500 మంది వరకు ఉన్నట్టు తేలినట్టు తెలిసింది.
సరెండర్ చేయకుండ విధులు
నిబంధనల ప్రకారం చెక్ పోస్టులను ఎత్తేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఉద్యోగు లను ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంది. కానీ, అలా చేయకుండానే వారిని అనధికారికంగా కమర్షియల్ ట్యాక్స్‌లోని ఇతర విభాగాలకు కేటాయించారు. శ్రీదేవి కమిషనర్ అయిన తర్వాత ఈ ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్ చేసే ప్రయత్నం జరిగిందని ఉద్యోగులు అంటున్నారు.






