పీవోకే పాక్‌లో భాగం కాదు
కోర్టులో పాకిస్థాన్ అంగీకారం
అక్కడ పాక్ చట్టాలు చెల్లవని వ్యాఖ్య
పాకిస్థాన్ కవి మిస్సింగ్ కేసు విచారణ సందర్భంగా వెల్లడి
ఇస్లామాబాద్, జూన్ 2 : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవో కే) పాకిస్థాన్‌లో భాగం కాదని ఆ దేశం అంగీకరించింది. పీవోకే పాకిస్థాన్‌లో భాగం కాదని చెప్పకనే చెప్పింది. పాకిస్థాన్ ఆర్మీపై బహిరంగంగా విమర్శలు చేసిన కవి, జర్నలిస్టు అహ్మద్ ఫర్హద్ షా (38) కొద్దిరోజులుగా కనిపించకుండా పోయారు. పాక్ మిలిటరీ బలగాలను విమర్శించిన కొద్ది గంటల్లోనే ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రావల్పిండి గ్యారీసన్ సిటీలోని తన ఇంట్లో నుంచి తన భర్తను పాకి స్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ మే 15న కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ వేశారు. దీంతో, అహ్మద్ ఫర్హాద్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని న్యాయమూర్తి జస్టిస్ మొహ్సిన్ అక్తర్ ఖయానీ బెంచ్ పాకిస్తాన్ ప్రభుత్వ అటార్నీ జనరల్‌ను ఆదే శించింది.
అయితే, ఫర్హాద్ షా పీవోకేలోని పోలీస్ కస్టడీలో ఉన్నాడని, అతన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరుపర్చలేమని అటార్నీ జనరల్ మన్సూర్ ఉస్మాన్ అవాన్ కోర్టుకు తెలిపారు. పీవోకే విదేశీ భూ భాగమని, ఆ ప్రాంతానికి సొంత రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని అక్క డ పాకిస్తాన్ కోర్టుల తీర్పు లు చెల్లవని ఆయన కోర్టు కు వివరించారు. అందువల్ల అతడిని పాక్ కోర్టు ఎదుట హాజరుపర్చలేమని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పీవోకే విదేశీ భూ భాగమైతే పాకిస్తాన్ ఆర్మీ, పాక్ రేంజర్లు ఆ ప్రాంతంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారని జస్టిస్ ఖయానీ ప్రశ్నించారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు విచారణ పేరుతో పీవోకేలో అక్రమంగా ప్రవేశించి ప్రజలను బలవంతంగా తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా, జర్న లిస్టు అహ్మర్ ఫర్హాద్ షా పీవోకే ప్రజల హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాడుతున్నా రు. గతంలో పీవోకేలో జరిగిన అనేక ప్రభు త్వ వ్యతిరేక నిరసనలకు ఆయన నాయకత్వం వహించారు.






