జడ్పీటీసీ నుంచి.. రాజ్యసభ వరకు
వేం నరేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
మహబూబాబాద్, మార్చి ౪ (విజయక్రాం తి): కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేయనున్న వేం నరేందర్‌రెడ్డి.. గతంలో జడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన డిసెంబర్ 26, 1960లో చెన్నకృష్ణారెడ్డి,వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారులు కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్ ఉన్నారు. జన్మస్థలం అర్పణ పల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా. డిగ్రీ పట్టభద్రుడు.
టీడీపీతో రాజకీయ అరంగేట్రం
తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగే ట్రం చేసిన వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని కాంక్షిస్తూ నల్లబెల్లి జడ్పిటిసిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం మహబూ బాబాద్ ఎమ్మెల్యే స్థానం నుండి అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యను కాదని చంద్రబాబు నాయుడు వేం నరేందర్ రెడ్డి కి టిడిపి టికెట్ ఇచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ వర్ధన్ రెడ్డి, రెబల్ అభ్యర్థిగా జనతా పార్టీ నుంచి భరత్ చంద్ర రెడ్డి పోటీ చేయడంతో కాంగ్రెస్ ఓట్లు చీలి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2010లో వరంగల్ వెస్ట్, 2015 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2017లో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ ఉపాధ్యక్షుడి గా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పబ్లిక్ అఫైర్స్ ముఖ్య సలహాదారుడిగా క్యాబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.




