డిగ్రీలో కామర్స్‌కు ఫుల్ డిమాండ్!
- ఆ కోర్సునే ఎంచుకుంటున్న ఎక్కువ మంది
- ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో మొగ్గు
- ఆ తర్వాత లైఫ్‌సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులు
- ఆర్ట్స్‌పై ఆసక్తి చూపని విద్యార్థులు
- డిగ్రీలో 62 శాతం మంది అమ్మాయిలే
- మొదటి విడుత దోస్త్‌లో 76,290 సీట్లు కేటాయింపు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): డిగ్రీలో కామర్స్ కోర్సుదే హవా కొనసాగుతోంది. ఈ కోర్సులో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని కోర్సుల కంటే కూడా కామర్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరుతోంది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుతలో సీట్ల కేటాయింపే ఇందుకు నిదర్శనం. మొదటి విడుత దోస్త్ సీట్లను గురువారం కేటయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 886 కాలేజీలుంటే ఇందులో సీట్లు 3,84,748 ఉన్నాయి. వీటిలో 28,655 (37.56 శాతం) మంది అభ్యర్థులు కామర్స్ గ్రూపునే ఎంచుకోవడం విశేషం.
అమ్మాయిలే ఎక్కువ
తొలివిడుతలో 76,290 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వీరిలో అబ్బాయిలు 28,423 (37.26 శాతం) మంది ఉంటే, అమ్మాయిలు అత్యధికంగా 47,867 (62.74 శాతం) మంది ఉన్నారు. వీరిలోనూ కామర్స్ విద్యార్థులే ఎక్కువ మంది ఉండటం విశేషం. ఫస్ట్ ఫేజ్‌లో ఫ్యాకల్టీ వైస్‌గా 20 మంది టాపర్లలో ఒక్కరే అబ్బాయి, మిగిలినవారంతా అమ్మాయిలే ఉండటం గమనార్హం. గతేడాదిలో ఫస్ట్ ఫేజ్‌లో కామర్స్ గ్రూపును 33,251 (45.41 శాతం) మంది విద్యార్థులు ఎంచుకున్నారు. ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గినప్పటికీ కామర్స్ గ్రూపులో చేరేందుకే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కామర్స్ గ్రూపు తర్వాతి స్థానాల్లో లైఫ్‌సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఆర్ట్స్ గ్రూపులున్నాయి.
70 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు
దోస్త్ కింద మొత్తం కళాశాలలు (రెసిడెన్షియల్ మినహా) 886 ఉండగా, వీటిలో మొత్తం 546 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరానికి మొత్తం 3,84,748 సీట్లు అందుబా టులో ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 76,290 సీట్లు భర్తీ కాగా, మిగిలిన సీట్లను రెండు, మూడు, తుదివిడుతల్లో భర్తీ చేయనున్నారు. విద్యార్థులకు సరిపడా సీట్లు ఉన్న ట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మొదటి విడుత సీట్ల కేటాయింపులో జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీలు 70 ఉన్నాయని వివరించారు.
ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ
రెండో విడుత సీట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఈనెల 14 వరకు చేపట్టనున్నాయి. 18న రెండో విడుత సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడుతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 7 నుంచి 12 వరకు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థుల కంటే సీట్లే ఎక్కువ
విద్యార్థుల సంఖ్య కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్‌లో ఈసారి పాసైనవారు 2,83,530 ఉంటే, డిగ్రీలో 3,84,748 సీట్లు ఉన్నాయి. ఉన్నత విద్యలో అమ్మాయిలు ఎక్కువగా రాణిస్తున్నారు. మొదటి విడుతలో వెబ్ ఆప్షన్లను మొత్తం 81,769 పెట్టుకోగా, వీరిలో 76,290 మంది సీట్లు పొందారు. మొదటి ప్రాధాన్యంలో సీట్లు పొందినవారు 55,124 మంది ఉన్నారు.
బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి






