20-02-2026 12:05:55 AM
‘విజయక్రాంతి ’ ఆనాడే హెచ్చరించింది
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి):కోర్టు ఆదేశంతో పాల్వంచ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు సీజ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలోని కార్యాలయం అతి సమీపంలో ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకుని, నిబంధనలను గాలికి వదిలి ఫంక్షన్ హాల్ నిర్మించిన వైనం ఇది. ఫంక్షన్ హాల్ తో పాటు కాంప్లెక్స్ నిర్మాణం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించడంతోపాటు మున్సిపాల్టీ రోడ్డును సైతం ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని ‘విజయక్రాంతి’ గతేడాది సెప్టెంబర్‌లోనే ‘అనుమతులు నిల్ వ్యాపారాలు ఫుల్’ అనే శీర్షిక ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం విదితమే. ఫంక్షన్ హాల్‌కు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో అతిథులు వాహనాలను రోడ్డుపైనే నిలపాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది.
ఫంక్షన్ల సమయంలో డీజీలు, మైకులు ఏర్పాటు చేయడం వృద్ధులు, రోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ సమీపంలోని ప్రజలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం అనుమతుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి ఫంక్షన్ హాల్‌పై చర్యలు తీసుకోవాలం టూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు.
సదరు కార్పొరేషన్ అధికారులు ఫంక్షన్ హాల్‌ను తనిఖీ చేసి రికార్డుల ను పరిశీలించారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం దగ్గర సరైన అనుమతి పత్రాలు లేనందున ఫంక్షన్ హాల్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరాదని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోర్టు ఆదేశం మేరకే సీజ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత ఫంక్షన్ హాల్ నిర్మాణంలో సరైన అనుమతులు లేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత తెలిపారు.