నష్టమేమీ లేదు
కొందరు వెళ్లిపోవడంపై పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
- జంపింగ్‌ల కట్టడిపై దృష్టి.. ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లో సమావేశం
- భేటీకి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి దూరం
- వీరంతా కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం.. ఇప్పటికే ఢిల్లీలో గూడెం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కీలక నేతల వరుస జంపింగ్‌ల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అల్టర్ అయ్యారు. ప్రస్తుతం పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా కాపాడుకునేందుకు వారితో మంగళవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉందని, అనర్హత వేటు కోసం పార్టీ న్యాయపోరాటం చేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
మరో ఆర్నెల్లు వేచి చూద్దామని, తరువాత ప్రభుత్వం చేసే తప్పులపై ప్రజల్లోకి వెళదామని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కార్యకర్త లను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రన బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టంలేదన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన అంశంపై ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారితే పట్టించుకోవద్దని, వైఎస్ పాలనలో ఇలాంటివి ఎన్నో జరిగినా తాను భయపడలేదని పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులను తరుచూ కలుస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ షేరి సుభాశ్‌రెడ్డి, దండె విఠల్, జోగు రామన్నతో పాటు మరికొందరు ఉన్నారు.
బెదిరింపులకు భయపడవద్దు: పల్లా
అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఏ సమయంలోనైనా ప్రభుత్వం కూలిపోతుందనే భయం కాంగ్రెస్‌లో ఉందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని సర్కార్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధి పేరు తో పార్టీ మారుతున్నామనే ఎమ్మెల్యేల మాటలు బోగస్ అని, ఆర్థికంగా బలపడేందుకు తల్లి లాంటి పార్టీకి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యే పోచారం, సంజయ్‌కుమార్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నా రు. ఆ బాధ్యతలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి అప్పగించింది. సాయంత్రం స్పీకర్‌ను కలిసేందుకు సమయం అడగ్గా ఆలోచించి చెబుతా నని సమాధానం చెప్పినట్లు తెలిపారు.
ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు
కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, అంబర్‌పేట కాలేరు వెంకటేశ్, పటాన్ చెరు గూడెం మహిపాల్‌రెడ్డి హాజరుకాలేదు. ఇందులో మహిపాల్‌రెడ్డి ఢిల్లీలో ఉండగా మిగతావారు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీరంతా రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారమూ జరుగుతుంది.






