8 April, 2026 | 2:21 AM

భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.1.80 కోట్ల నిధులు మంజూరు

08-04-2026 12:29 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ 

తాడ్వాయి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సంతాయిపేట భీమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ. 1.80 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో ఆలయాన్ని ఎవరు పట్టించుకోలేదని, దీంతో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆలయాన్ని సందర్శించానని, ఆలయ విశిష్టతను గుర్తించానని  తెలిపారు.దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొన్న పవిత్రమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిచినట్లు తెలిపారు.

ఈ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దట్టమైన అరణ్యంలో ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని తెలిపారు. పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ సంచరించారని ఆ సమయంలో భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారని స్థల పురాణం చెబుతుందన్నారు. ఇక్కడ శివుడు పంచముఖంగా దర్శనమిస్తారని తెలిపారు.ఎన్నో ప్రత్యేకతలున్న - ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఆలయం గురించి ప్రస్తావించానని తెలిపారు. చాలా పర్యాయాలు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎండి క్రాంతిని కలిసి నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే మదన్మోహన్ ను ఘనంగా సన్మానించారు.ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కూర్చుండి సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే తాడ్వాయిలో కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లే రోడ్డుకు సిసి రోడ్డు నిర్మాణానికి, శ్రీ శబరిమాత గుట్టపై కి వెళ్లే  సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు సంతాయిపేట లో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ భాస్కర్ రెడ్డి,నాయకులు ఆకిటి వెంకట్ రామ్ రెడ్డి, అంబీర్ శ్యాం రావు, ప్రతాప్ రెడ్డి,షౌకత్ అలీ, కృష్ణమూర్తి సుతారి సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.