4 September, 2026 | 6:06 AM

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

04-09-2026 | 04:50am

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

బోధన్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): బోధన్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో మత సామరస్యాన్ని కాపాడుతూ నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచిం చారు(Nizamabad Police Commissioner P. Sai Chaitanya). గణేష్ చవితి సందర్భంగా గురువారం బోధన్ లయన్స్ క్లబ్ ఆడిటోరియం లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తు పోలీస్ అనుమతులు తీసుకుని, భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్రాఫిక్, పార్కింగ్, విద్యుత్, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగంలో నిర్దేశిత సమయాలు, శబ్ద పరిమితులు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిమజ్జన ఊరేగింపులో నిర్ణయించిన మార్గాలు, సమయాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సర్పంచులు, కౌన్సిలర్లు, గణేష్ మండపాల నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీ కోరారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, పోలీస్ అధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, గణేష్ మండలి నిర్వాహకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.