calender_icon.png 10 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన గణేశ్ నిమజ్జనం

08-09-2025 01:11:03 AM

  1. రెండు రోజులపాటు శ్రమించిన పోలీసులు 
  2. నిద్ర లేకుండా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం 
  3. 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర - 
  4. 3 లక్షల గణేష్ విగ్రహాలు నిమజ్జనం
  5. 20 వేల టన్నుల వ్యర్థాల సేకరణ
  6. 1,070 మంది ఆకతాయిలను పట్టుకున్న షీ టీమ్స్
  7. శాంతిభద్రతల రక్షణకు అవిశ్రాంత కృషి: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రశాం తంగా వినాయకుల నిమజ్జనం ప్రక్రియ దాదాపు ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల 3 వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయగా.. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 25 వేల ప్రతిమల నిమజ్జనం చేశారు. 20 వేల టన్నుల వ్యర్థాల సేకరణ జరిగింది.

గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జన కార్యక్రమం రెండో రోజు ముగింపు సందర్భంగా, హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగిందని డీజీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ వెల్లడించారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర దాదాపు 40 గంటల పాటు అవిశ్రాంతంగా కొనసాగిందని సీపీ ఆనంద్ తెలిపారు.

ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల శోభాయాత్ర కొంత ఆలస్యమైనప్పటికీ, పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా పనిచేసి నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారని కొనియాడారు. భద్రతా ఏర్పాట్లలో భాగం గా 9 డ్రోన్లు, 35 హై-రైజ్ భవ నాలపై కెమెరాలను ఉపయోగించి నిరంతర నిఘా పెట్టామని ఆయన తెలిపారు.

సెంట్రల్ జోన్ పోలీసులు, జీహెఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్‌టీఏ, హెఎండీఏ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య ఉన్న అద్భుత సమన్వయం వల్లే నిమజ్జనం విజయవంతమైందని ఆయన ప్రశంసించారు. నిమజ్జన ఊరేగిం పులో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదైనట్లు సీపీ ఆనంద్ తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పోలీసులు పట్టు కున్నారని వెల్ల డించారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మంది ఆకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నా మని వివరించారు. దాదాపు 40 గంటల పాటు అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బంది, అధికారు లందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు. తెలుగుతల్లి ఫ్లుఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్‌బాగ్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో రాకపో కలు ప్రారంభమయ్యాయి. రహదారులపై పేరుకుపో యిన చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు

గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని, అద్భుతమైన ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన జీహెఎంసీ అధికా రులు, సిబ్బంది, అలాగే పోలీసు, విద్యుత్, హెఎండీఏ, హైడ్రా, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ అభినందనలు తెలియ జేశారు.

పకడ్బందీ ప్రణాళికతో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, సరిపడా క్రేన్ల సదుపాయం వంటి జీహెఎంసీ చర్యలు సత్ఫలితాలనిచ్చాయని వారు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు అధికారులు తెలిపారు.

15 వేల మంది సిబ్బంది 247 మూడు షిఫ్టుల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని అన్నారు. ఇప్పటివరకు 11 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల నిరంతర సేవలను మేయర్, కమిషనర్ ప్రశంసించారు. 

ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు అభినందనలు తెలిపిన  సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారని సీఎం తెలిపారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు అందరికీకి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.