షాద్ నగర్ మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చిదిద్దండి
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల కు సూచన
షాద్ నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాలకవర్గాలు చిత్తశుద్ధితో పనిచేసి షాద్ నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సూచించారు. శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నూతన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ లతో పాటు కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేస్తూ శాలువాలతో సన్మానించారు.
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో వీరిని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత రాణించాలని అన్నారు. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఎమ్మెల్యే శంకర్ అయ్యాడని, తాను ఎంపీ అయ్యానని,bతనలాంటి వారు ఎందరో కాంగ్రెస్ సైనికులు ప్రజాసేవలో తరిస్తున్నారని డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని మల్లురవి సూచించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలపరిచి విజయం చేకూర్చాలని దీనిని వమ్ము చేయకుండా ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లతోపాటు కౌన్సిలర్లు మురళీమోహన్ అప్పి, రాజు నాయక్, దిలీప్, ముబారక్ అలీ ఖాన్,తదితరులను శాలువాలతో ఎంపీ మల్లు రవి సన్మానించారు. మున్సిపాలిటీ పాలకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా అందజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఎంపీ మల్లురవి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, జంగ నరసింహా తదితరులు పాల్గొన్నారు..




