18 April, 2026 | 3:44 AM

గ్యాస్ ఏజెన్సీల ‘బ్లాక్’ దందా..?

18-04-2026 01:05 AM

సామాన్యుడి నడ్డి విరుస్తున్న అక్రమ విక్రయాలు..

హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లాలో గ్యాస్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు సామాన్య ప్రజలకు, చిరు వ్యాపారులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్లైన్ బుకింగ్ పేరుతో జాప్యం చేస్తూ.. మరోవైపు అధిక ధరలకు బ్లాక్లో సిలిండర్లను విక్రయిస్తూ ఏజెన్సీలు కాసుల వేటలో పడ్డాయనే విమర్శలు బాహటంగా వినిపిస్తున్నాయి.  పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫలితంగా,  దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.

ఆన్లైన్ ముసుగులో అంతులేని జాప్యం

గ్యాస్ కొరత కారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొంతకాలం గడువు విధిస్తూ ఆన్లైన్ బుకింగ్ విధానం వినియోగదారులకు సౌకర్యంగా ఉండాల్సింది పోయి, ఇబ్బందుల పాలయ్యేలా చేస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేస్తే అది ఇంటికి చేరడానికి 20 రోజులకు పైగా సమయం పడుతోందని, దీనివల్ల సామాన్యులు కట్టెల పొయ్యి వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. వెంటనే ఈ ఆన్లైన్ విధానాన్ని పక్కన పెట్టి, పాత పద్ధతిలోనే ఇంటింటికీ సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఓటిపి లతో మోసం.. బ్లాక్ మార్కెట్కు సిలిండర్లు?

కొన్ని ఏజెన్సీలు, డెలివరీ బాయ్ లు  అనుసరిస్తున్న కొత్త తరహా మోసం వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోంది. గ్యాస్ పంపిణీ చేయకముందే వినియోగదారుల వద్ద నుంచి రకరకాల సాకులతో ఓటిపి  లను సేకరిస్తున్నారు. సాఫ్ట్వేర్లో డెలివరీ అయినట్లు చూపిస్తూ.. ఆ సిలిండర్లను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వంట గ్యాస్ ధర అధికారికంగా రవాణా చార్జీలతో కలిపి 1000 ఉండగా, బ్లాక్లో రూ. 2 వేలకు విక్రయిస్తున్నారని, ఇక ఇదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1850 ఉండగా, ఏకంగా  3వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వీధిన పడుతున్న చిరు వ్యాపారులు

గ్యాస్ ధరల సెగ హోటల్ యజమానులకు, బజ్జీల బండి వ్యాపారులకు గట్టిగా తగులుతోంది. కమర్షియల్ గ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో వ్యాపారాలు సాగించడం భారంగా మారింది. పోనీ కట్టెల పొయ్యి మీద వంట చేద్దామన్నా.. కట్టెల ధరలు కూడా వేలల్లో ఉండటంతో ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి‘ చందంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏది..?

జిల్లా వ్యాప్తంగా ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్నా, పౌరసరఫరాల శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న గ్యాస్ ఏజెన్సీల గోదాములపై దాడులు నిర్వహించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గృహ, వాణిజ్య వినియోగదారులు కోరుతున్నారు.

అక్రమాలకు పాల్పడితే ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తాం

గ్యాస్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై సివిల్ సప్లై డిటి సదానందం స్పందిస్తూ.. వినియోగదారుల వద్ద నుంచి ముందస్తుగా ఓటిపిలు సేకరించడం, సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించినా లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

త్వరలోనే ప్రత్యేక బృందాలతో ఏజెన్సీ గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమాలు రుజువైతే ఏజెన్సీ లైసెన్సులను రద్దు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. వినియోగదారులు ఎవరైనా ఇబ్బందులకు గురైతే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

- సదానందం, సివిల్ సప్లై డీటీ