ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు
- వివరాలు సేకరించిన ఎంఈఓ వెంకటేశ్వర్లు
- సోమవారం నాటికి కనెక్షన్ల మంజూరుకు చర్యలు
ఇటిక్యాల, జూన్ 19: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇటిక్యాల మండల విద్యాశాఖాధికారి (ఎం.ఈ.ఓ) శ్రీ వెంకటేశ్వర్లు శుక్రవారం మండల కేంద్రంలోని ’భాను ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ’ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియపై ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, దరఖాస్తులు, అలాగే నెలవారీగా అవసరమయ్యే గ్యాస్ సిలిండర్ల సమగ్ర వివరాలను ఏజెన్సీ ప్రతినిధులకు అందజేశారు.
సోమవారం నాటికి ప్రక్రియ పూర్తి...
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిలిండర్ల వివరాలను సమర్పించినట్లు ఎంఈఓ తెలిపారు. అధికారుల నుంచి వివరాలను స్వీకరించిన గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. డాక్యుమెంట్లను పరిశీలించి, రాబోయే సోమవారం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ కోఆర్డినేటర్ కాజా, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






