పంటల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య
కూసుమంచి,(విజయక్రాంతి): డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి రైతు పంట వివరాలను తప్పులేకుండా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. శనివారం గురవాయిగూడెం గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్ వెంకటేష్ నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించి, తగు సూచనలు చేశారు. రైతులు పండించిన పత్తి, వరి, పెసర తదితర పంటల వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సమయంలో రైతుల వివరాలు, పంట వివరాలు సరిగా నమోదు కాకపోతే నష్టపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అందువల్ల పంటల నమోదు సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని వాలంటీర్లను ఆదేశించారు. రైతులు తమ గ్రామాల్లో పంటల వివరాలను నమోదు చేస్తున్న వాలంటీర్లను సంప్రదించి, తమ పంట వివరాలు తప్పులేకుండా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.
వాలంటీర్లు త్వరితగతిన రైతుల పంట వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు వాలంటీర్లతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ సర్వేను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. అనంతరం అపరాలలో మిషన్ ఫర్ ఆత్మనిర్బరత పథకం ద్వారా రాయితీపై పెసర విత్తనాలను రైతులకు అందించారు.అనంతరం పెసర మరియు ప్రత్తి పంటను పరిశీలించి రసం పీల్చు నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ సరిత, కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజేష్, మండల వ్యవసాయ అధికారి శ్రీమతి రామడుగు వాణి మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు రవీందర్ , రవి , ఉపేందర్ , ప్రియాంక పాల్గొన్నారు.






