29 August, 2026 | 7:54 PM

నియోజకవర్గ ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడమే నా ఏకైక ఎజెండా

29-08-2026 07:23 PM

6 నెలల్లో దేవాదుల పనులను 100శాతం పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందిస్తాం

స్టేషన్ ఘనాపూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మెడిగడ్డ నుండి 1 టీఎంసి ఎత్తిపోయలేదనీ, అయినా వరుసగా 2 ఏళ్ళు ధాన్యం దిగుబడిలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, బిఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణను ఏరకంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసని, ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైండ్ భూములను  కోళ్లగొట్టారని, దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 6 నెలల్లో పూర్తిచేసి స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి దేవాదుల నీరు అందిస్తామని మాజీ మంత్రి, స్టేషన్ ఘనాపూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి అన్నారు.

స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి రిజర్వాయర్ ఆయకట్టుకు పంట కాలువ ద్వారా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా తూము వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 100ఎకరాలు కట్టబెట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించారన్నారు.

2014 ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని... ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి,వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. బిఆర్ఎస్ నాయకులపైన అనేక అవినీతి, అక్రమాల కేసులు ఉన్నాయని, ఈ రోజు వాళ్లే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే కల్వకుంట్ల కవిత చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని కడియం డిమాండ్ చేశారు.

జీవో 97 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ అందుకు విద్యార్థులు ఒప్పుకోవడం లేదని,.పాల్టెక్నీక్ విద్యపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పద్ధతినే తెలంగాణలోనూ కొనసాగించాలన్నారు. విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా జీవో 97రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరుతున్నట్ల కడియం శ్రీహరి తెలిపారు.