29 August, 2026 | 7:48 PM

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

29-08-2026 07:18 PM

ఉట్నూర్, ఆగస్టు 29( విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లో నిర్వహించిన సమావేశంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల సమీక్షా సమావేశంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షకులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు (DTWOలు), ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులు, హెచ్‌డబ్ల్యూఓలతో కలిసి విద్యార్థుల ఆధార్ అప్‌డేట్, డ్రాప్‌అవుట్ పరిస్థితి, విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు తదితర అంశాలపై పీవో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రాప్‌అవుట్‌కు కారణాలను గుర్తించి, విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధనా పద్ధతులను మెరుగుపరచాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా సులభమైన బోధనా విధానాలను అవలంబిస్తూ, వారి మాట్లాడే, చదివే, రాసే సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అన్ని విభాగాల అధికారులు, పాఠశాలల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పీవో సూచించారు. ప్రతి సమీక్షా సమావేశానికి అధికారులు ముందుగానే పూర్తి సమాచారాన్ని సేకరించి, ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో హాజరు కావాలని స్పష్టం చేశారు. 

పాఠశాలల్లో విద్యా పరిస్థితులు, విద్యార్థుల హాజరు, డ్రాప్‌అవుట్, బోధనా ప్రమాణాలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి నెల 26వ తేదీన పాఠశాల స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో గుర్తించిన సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాలను రూపొందించి, తదుపరి సమావేశంలో పురోగతిని సమీక్షించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన బోధనా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు సూచించారు.