calender_icon.png 21 January, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల్లేని తెలంగాణతో జీడీపీ డబుల్

21-01-2026 01:44:37 AM

చట్టాలు మారుస్తున్నా అమలులో చిత్తశుద్ధి లేదు  

సమగ్ర భూ సర్వేతోనే వివాదాలకు చెక్  

ధరణి, భూభారతిపై రౌండ్ టేబుల్ సమావేశం

ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): భూ సమస్యలు లేని తెలంగాణ సాధ్యమైతే రాష్ట్ర జీడీపీ ప్రస్తుతమున్న దానికంటే రెండు రెట్లు పెరుగుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, కొత్త చట్టాలు తెచ్చినా భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, చట్టాల అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించిందని ఆయన విమర్శించారు. మంగళ వారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ టీజేయూ, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిందా.. అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చినప్పుడు తాను ప్రభుత్వంతో కొట్లాడానని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతిలో ఆ అఫిడవిట్‌ను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.సామాన్య ప్రజలు తమ కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లు కొన్ని ఏళ్లకు కబ్జా పాలవుతున్నాయని, ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలపై దష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు భూభారతి చట్టంలో సంస్కరణల సవరణలు అవసరం లేదని, కేవలం సాంకేతిక పరంగా మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సర్వీస్ యాక్టును తీసుకురావాలని, సమగ్ర భూ సర్వే రీ-సర్వే చేపడితేనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామసభల్లో రైతుల నుంచి లిఖితపూర్వక దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. కేరళ రాష్ట్ర తరహాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పరి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్, రైతులు పాల్గొన్నారు.