క్యూ4లో జీడీపీ వృద్ధి 6.7శాతం
ఇండియా రేటింగ్స్ అంచనా
ముంబై, మే 19: మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో దేశ జీడీపీ 6.7 శాతం వృద్ధిని కనపరుస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 6.9-7 శాతం మధ్య ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్టు ఇండియా రేటింగ్స్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ సునీల్ కుమార్ సిన్హా చెప్పారు. 2024 జనవరి- మార్చి త్రైమాసిక జీడీపీ గణాంకాలు, 2023-24 ఆర్థిక సంవత్సరపు ప్రొవిజినల్ అంచనాల్ని మే 31న కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం చొప్పున భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందింది.
తక్కువ బేస్ కారణంగా ముగిసిన ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలకు ప్రయోజనం కలిగిందని, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి ఆశ్చర్యపర్చిందని సిన్హా వివరించారు. క్యూ3లో అధిక పన్ను వసూళ్ల ద్వారా జీడీపీ పెరిగిందని, ఇదే ఫీట్ క్యూ4లో రిపీట్ అయ్యే అవకాశం లేదని భావిస్తున్నట్టు చెప్పారు. 2023-24లో జీడీపీ 7 శాతం వృద్ధిచెందవచ్చని రిజర్వ్‌బ్యాంక్ ఇటీవలి అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 7.1 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదుకావొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తున్నది.
వచ్చే 2-3 ఏండ్లలో మూడో స్థానానికి భారత్
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్‌లో 2012లో మనం 11వ స్థానంలో ఉన్నామని, ఇప్పుడు 5వ స్థానానికి చేరుకున్నామని, వచ్చే 2-3 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ చెప్పారు. సీఐఐ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వృద్ధి జోరుకు మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వం చేసిన పెట్టుబడులు ప్రధాన కారణమని అన్నారు. ఫిజికల్, డిజిటల్ ఇన్‌ఫ్రాలో చేసిన పెట్టుబడులు జీడీపీని 1.7 శాతం పెంచాయన్నారు.






